Thursday 16 May 2013

Episode - 3



రివ్వున లేచి అంబులెన్స్ కి కాల్ చేసి క్రిష్టినాని రెండుచేతుల్లోకి ఎత్తుకొని బయటికి వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్ కి తీసుకెళ్ళి జాయిన్ చేసాడు.

ఇంత రగడకూ కారణమైన సామంత్ చేసిన ద్రోహానికి స్వతహాకా మృదు స్వభావి ఐన కృష్ణమోహన్ సైతం అదుపులేని లేని అశాంతితో రగిలిపోయాడు. ఈలోగా విషయం తెలిసిన క్లాస్ మేట్స్ వచ్చేసరికి కాస్త తమాయించుకొన్నాడు. డాక్టర్స్ షి ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాక ఇంటికి బయల్దేరాడు. ఇంటికి వెళ్ళగానే తల్లి నుంచి అర్జెంట్ గా రమ్మని కాల్. ఇండియాలో పని అవ్వగానే వస్తానని స్నేహితులకి క్రిష్టినా బాధ్యత అప్పగించి ఇండియా వచ్చాడు.

******************************************************************************
ఇల్లు చేరేసరికి ఏవో అపశకునాలు తోచడం మొదలయ్యింది. విదేశాల్లో చదువుకొంటున్న తనకి ఈ సిల్లీ సెంటిమెంట్సేంటా అనుకొంటూ చిన్నగా నవ్వుకొని ఇంట్లో అడుగుపెట్టాడు. ఎదురుగా కనిపించిన తల్లి స్వరూపం అపశకునాల ప్రభావాన్ని చూపింది. ఎప్పుడూ లక్ష్మీదేవిలా ఒంటినిండా నగలతో పదిమంది పనివాళ్ళకి పనులు పురమాయిస్తూ, ఇంటినిండుగా ఉన్న చుట్టాలతో హడావుడిగా మాట్లాడుతూ తిరిగే తల్లి శోకదేవతలా కూర్చొని ఉంది. తండ్రికోసం వెతికిన కళ్ళకి తండ్రి రూం లోంచి బయటికి వస్తున్న డాక్టర్ కనిపించారు.

ఆందోళనగా "అమ్మా" అంటూ ఇంట్లో అడుగు పెట్టగానే "బాబూ కృష్ణా..." అంటూ పరుగెత్తివచ్చి కొడుకు గుండెలపై తలవాల్చి భోరుమంది శాంత.

తల్లిని పొదివిపట్టుకొని "అమ్మా! ఏమయ్యింది? నాన్నేరి" అన్నాడు.

"ఆ దేవుడు చిన్న చూపు చూశాడ్రా. చక్రి అంకుల్ బిజినెస్ లో మోసం చేసాడు. మన ఆస్థులన్నీ అప్పులు తీర్చేందుకే సరిపోయాయిరా. మీ నాన్నగారికి హార్టెటాక్ వచ్చింది. డాక్టర్ తో నువ్ మాట్లాడ్రా నాకేం చెప్పట్లేదు" అంటూ ఏడ్వడం మొదలెట్టింది.

"అమ్మా ఊరుకో. నే వచ్చానుగా. అన్నీ నే చూసుకుంటాను" అంటూ డాక్టర్ కి ఎదురెళ్ళి "డాక్టర్ హౌ ఈస్ మై ఫాదర్?" అని అడిగాడు.

"కమాన్ మై బాయ్" అంటూ కృష్ణమోహన్ని తీసుకుని శశాంక్ రూం లోకి దారితీశాడు డాక్టర్.

రూం లో అడుగు పెట్టగానే పరిస్థితి అర్థమైపోయింది కృష్ణమోహన్ కి. తండ్రి ఆఖరి ఘడియల్లో ఉన్నారని. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. తమాయించుకుంటూ డాక్టర్ కేసి చూశాడు.

"బి బోల్డ్ మై బాయ్. లెట్ హిం స్లీప్ పీస్ఫుల్లీ" అన్నాడు డాక్టర్.

"నాన్నా" అంటూ తండ్రి కాళ్ళపై పడి ఏడవడం మొదలెట్టాడు.

స్పృహ వచ్చిన శశాంక్ "నాన్నా కృష్ణా వచ్చావా? నీకేం ఇవ్వకుండా పోతున్నాను నన్ను మన్నించరా. కానీ జీవితంలో చక్రి కుటుంబానికి దూరంగా ఉండు. వివరాలన్నీ నా డైరీలో ఉన్నాయి. పగలు ప్రతీకారాల జోలికి పోకు. సాధ్యమైనంతగా దేశసేవ చెయ్యి. ఇదే నా ఆఖరికోరిక" అని చెప్పి తలవాల్చేశాడు.

కొడుకు వెన్నంటి వచ్చిన శాంత "ఏమండీ" అని అరుస్తూ స్పృహ కోల్పోయింది.

మేనమామ, తండ్రి సన్నిహితులూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు సజావుగా జరిపించి అప్పులన్నీ తీర్చి "బాబూ కృష్ణా! నువ్ లండన్ వెళ్ళి చదువు పూర్తి చేసుకొని రా. తరవాత ఇక్కడి విషయాలు చూసుకుందాం" అన్నారు. కానీ మనస్కరించక తండ్రి డైరీ లో వివరాలు మననం చేసుకుంటూ సామంత్ ఇంటికి బయలుదేరాడు.

సామంత్ ఇల్లు చేరగానే తనకళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఇంద్రభవనంలాంటి ఏడంతస్థులమేడ. వాచ్ మన్ వినయంగా నమస్కరించి గేటు తీసాడు. లోపలికి అడుగు పెట్టగానే హాల్ లో సోఫాలో కూర్చొని పార్ట్నర్స్ తో మాట్లాడుతున్న చక్రి అంకుల్ కనిపించాడు. రక్తం మరుగుతున్నా తండ్రి మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని నిదానించుకొన్నాడు.

కృష్ణమోహన్ని చూడగానే మోమునిండా ఆనందం పులుముకొంటూ "ఓ.కే జెంటిల్ మెన్! లెట్స్ మీట్ ఇన్ ఆఫీస్" అని "శారదా! మన కృష్ణొచ్చాడు" అంటూ లేచి ఎదురొచ్చాడు చక్రవర్తి.

"రా కృష్ణ నాన్న పోయాడట కదా సారీరా ఆ టైం కి మేం యూ. ఎస్ వెళ్ళాం మా కోడలు ఏవో షాపింగ్ చేద్దామంటే" అని అక్కడికి అదేదో జస్ట్ సో సో అన్నట్లుగా లైట్ తీసుకోమన్నట్లుగా.

లోపలినుంచి ఆతృతగా వచ్చిన శారద తనంత ఎదిగిన కృష్ణని చూసి ఆప్యాయంగా "రా బాబూ ఎన్నాళ్ళయింది నిన్ను చూసి" అంటూ చెయ్యి పట్టుకోబోయింది.

మధ్యలోనే ఆమె చేయందుకొని "కడుపునిండా తిండి తిని ఎన్నాళ్ళయిందో నీ చేత్తో టిఫిన్ చేసి పెట్టు" అంటూ అడ్డుకున్నాడు చక్రవర్తి.

ఈ లోపు మేడమీదనుంచి దిగి వస్తున్న సామంత్ "హలో కృష్ణా! ఇండియా ఎప్పుడొచ్చావ్? ఇదేనా రావడం" అంటూ కాజువల్ గా పలకరించి "నాకు పనుంది మళ్ళీ కలుస్తా" అంటూ "కమాన్ డాళింగ్" అని భార్యతో కలిసి వెళ్ళిపోయాడు.

హాల్ మొత్తానికి ఇద్దరూ మిగిలిపోయారు. భయంకరమైన నిశ్శబ్దం. చివరికి కృష్ణ "ఏంటంకుల్ బిజినెస్ లో మా డాడీ నష్టపోవడమేంటి? మీరు మాత్రం బాగుండడమేంటి" అని అడిగాడు.

ఖంగు తిన్నా అనుభవశాలి కావటం మూలాన పాత సినిమాలో రాజనాలలా నవ్వుతూ "దాందేముంది మీ నాన్న జనాలని నమ్మి ష్యూరిటీలిచ్చి మునిగిపోయాడు. నే జాగ్రత్తగా ఉండి బతికిపోయాను" అన్నాడు అదేదో సాధారణ విషయమన్నట్టు.

"మీకు తెలియని వాళ్ళకి నాన్న ష్యూరిటీలెందుకిస్తారు? నాన్న జనాలని నమ్మి మోసపోలేదు మిమ్మల్ని నమ్మి ఆహుతయ్యారు" అన్నాడు ఆవేశంగా...

"నీకేం తెలుసురా పిల్ల కాకివి. అసలు మీ అమ్మనిచ్చి చెయ్యడానికి కూడా మీ తాత ఒప్పుకోకపోతే నేనే ఒప్పించాను మీ నాన్న అంత సమర్థుడురా" అన్నాడు వెటకారంగా.

తండ్రి డైరీలో విషయాలన్నీ చదివిన కృష్ణమోహన్ కి మనసు రగిలిపోయింది. శారద ఆంటీ తండ్రిని ఒప్పించి చక్రి అంకుల్ కి పెళ్ళి చేసిన తండ్రి గురించి అలా మాట్లాడుతుంటే. అప్పుడే అక్కడికి వచ్చిన శారద కల్పించుకొంటూ "బదులు తీర్చుకొన్నారు లెద్దురూ మీకూ నన్నిచ్చేందుకు అన్నయ్య కల్పించుకోవలసి రాలేదా" అని వాతావరణాన్ని తేలికపరిచే యత్నం చేసింది.

"బాబూ టిఫిన్ తిను" అంటూ ప్లేట్ అందించింది.

"వద్దు ఆంటీ నే అంకుల్ తో మాట్లాడాలని వచ్చాను" అన్నాడు.

"రా! నా రూం లోకి వెళ్ళి మట్లాడుకొందాం" అన్నాడు చక్రవర్తి.

రూం లోకి వెళ్ళగానే అడిగాడు "మా ఆస్థులు కుదవపెట్టి 10 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకొన్నారు కదా అవేమయ్యాయి?" అంటూ.

"నాకేం తెలుసురా మీ నాన్నకి చెడు స్నేహాలెక్కువ. అదంతా ఏ ఆడవాళ్ళకి ధారపోసాడో" అన్నాడు చక్రవర్తి.

అప్పటివరకూ ప్రశాంతతతో మనసుని బుజ్జగిస్తున్న కృష్ణమోహన్ కి ఉవ్వెత్తున లేచిన కోపం చక్రవర్తి కాలర్ పట్టుకొనేలా చేసింది. "ఎవరికున్నాయిరా చెడు స్నేహాలు? లాడ్జ్ లో దొరికిపోయి బ్రోతల్ కేసులో నువ్విరుక్కొంటే జామీనిచ్చి మా డాడీ కాదా తీసుకొచ్చినది? నాకేమీ తెలియవనుకొంటున్నావా" అన్నాడు ఆవేశంగా.

తడబడుతూ... "అదంతా అబద్ధం నీకెవరు చెప్పారోగానీ ఇంక నువ్వెళ్ళొచ్చు ఏదో మావాడి స్నేహితుడివని ఇంట్లోకి రానిస్తే నా కాలర్ పట్టుకొంటావా చూస్తూండు నీకూ మీ అమ్మకూ నిలువ నీడలేకుండా చేస్తాను. వాచ్ మన్ వాచ్ మన్" అని అరుస్తూ గది బయటికి నెట్టాడు కృష్ణమోహన్ని.

అప్పుడే అక్కడికి వచ్చిన శారద పడబోతున్న కృష్ణమోహన్ని పట్టుకొని అతను తీసుకొచ్చిన ఫైల్సన్నీ అతనికిచ్చి "నువ్వెళ్ళు బాబూ మీ అంకుల్ తో నే మాట్లాడతాను. రేపు మీ ఇంటికొస్తాను" అంది.

"నో ఆంటీ విషయమేంటో ఇప్పుడే తేలాలి. మా ఆస్థులన్నీ మా స్వాధీనమయ్యేదాకా నే విశ్రమించేది లేదు" అంటున్న కృష్ణమోహన్ని కోపంగా చూస్తూ...

"ఉండు ఇప్పుడే పోలిసులకి ఫోన్ చేస్తా వాళ్ళే నిన్ను పంపిస్తారు" అంటూ హాల్ లోకి వెళ్ళిపోయాడు చక్రవర్తి.

********************************************************************************* సశేషమిక్కడే.......మరల 23-5-13 వరకూ.......అప్పటివరకూ చదువరులూ శలవ్

*********************************************************************************

No comments:

Post a Comment