Thursday 2 May 2013

ఎపిసోడ్ - 1

ఆంధ్రా యూనివర్సిటీ కేంపస్ కళకళ లాడుతోంది. సమ్మర్ వెకేషన్ అనంతరం ఓపెన్ అయి కొద్దిరోజులే కావడంతో గాలి సైతం కొత్త పాత విద్యార్థుల కలయికకు పూలతో మేళవించి పరిమళిస్తూ స్వాగతమిస్తోంది. పచ్చికలో మెత్తగా నడుస్తున్న అమ్మాయిల పాదాలు, నడుంపైన నాట్యాలాడుతున్న కొందరు విరికొమ్మల వాలు జడలు, వారిపై కామెంట్స్ తో అల్లరి చేస్తున్న ఆకతాయిలు, బెరుగ్గా లోపలకి అడుగుపెడుతున్న కొత్త స్టూడెంట్స్, వాళ్ళల్లో బకరాలు దొరికితే ఓ చూపు చూద్దామనుకొంటున్న సీనియర్స్, వీళ్ళందరితో కేంపస్ మొత్తం కోలాహలంగా ఉంది.

ఇంతలో ఒక బ్లాక్ ఇన్నోవా వచ్చి మెత్తగా ఆగింది. అది కన్వీనర్ గారిది కావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. వెన్వెంటనే వెనుక కవాతు చేస్తున్న సైనికుల్లా వచ్చి ప్రిన్సిపాల్స్, డీన్స్, స్పెషల్ ఆఫీసర్స్ వెహికిల్సన్నీ వచ్చాయి. బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని కన్వీనరు దిగారు. ఇంతలో లోపలినుంచి వీ. సీ. గారు బయటకు వచ్చారు.

"హార్టీ వెల్కం టూ అవర్ బిలవ్డ్ సైంటిస్ట్ మిస్టర్ కృష్ణమోహన్" అంటూ స్వాగతించారు.

కృష్ణమోహన్ ... ఇండియా గర్వించదగ్గ గొప్ప నిస్వార్ధ సైంటిస్ట్. లండన్ లో శతృదేశాల అణ్వాయుధాలను నిర్వీర్యం చేసే పరికరాన్ని కనిపెట్టే దిశగా ప్రయోగాలు చేస్తూ అది ఆఖరి దశలో ఉండగా భారత దేశం నుంచి పిలుపు వచ్చేసరికి ప్రయోగాన్ని మధ్యలో ఆపి ఇండియాకి తిరిగొచ్చారు. వారికి భారతావనికి అత్యంత అవసరమైన, మరియు క్లిష్టమైన ప్రయోగాన్ని ప్రభుత్వం అప్పగించడం జరిగింది. ఆ ప్రయోగానికి అవసరమైన సహకారం కోసం అత్యంత నమ్మకస్తులైన సైంటిస్టుల నిమిత్తం కృష్ణమోహన్ యూనివర్సిటీ వారి ఆహ్వానాన్నందుకొని రావడం తటస్థించింది.

కారు డోర్ తీసుకొని ఒక స్ఫురద్రూపి దిగారు. ఆరడుగుల నిండైన విగ్రహం, విజ్ఞతకు సూచనగా చిరుముడతలు పడిన నుదురు, చురుగ్గా చూస్తున్న కళ్ళు, మేధావిత్వానికి సంకేతమన్నట్లు అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు, చూడగానే ఎవరికైనా నమస్కరించాలనిపించే హుందాతనంతో కృష్ణమోహన్ బయటకు వచ్చేసరికి పైనుంచి పూల వాన కురిసింది.

మొహమాటపడుతూ "సర్! వాట్స్ దిస్?" అని వీసీ గారివైపు చూసారు కృష్ణమోహన్.

చిరునవ్వుతో "ఇట్స్ అవర్ ఫార్మాలిటీ సర్" అని జవాబిచ్చారు వీ సీ.

"కమాన్ బేబీ" అంటూ కారులోకి చూస్తూ పిలిచారు కృష్ణమోహన్.

అందరూ ఆత్రుతగా చూస్తుంటే డోర్ తీసుకొని దిగింది ఒక జాజిమొగ్గలాంటి అమ్మాయి. మోముపై ఆటలాడుతూ గాలికి అల్లల్లాడే మెత్తని కురులను పైకి తోసుకునే వేళ్ళ సోయగమే చూపరులను అచ్చెరువులను చేస్తోంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం పెంచబడిన సౌకుమార్యం అక్కడ కొలువుదీరినట్లనిపిస్తోంది. మల్లెపూలు, మెత్తని గంధం కలిపి రంగరించినట్లున్న మేని ఛాయ, తీరైన కనుముక్కు తీరు, అమ్మాయిలు సైతం అసూయ పడే అందం తో నడుము దాటిన జడ నయగారాలు పోతూ అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తూ దివి నుంచి దిగిందా అని భ్రమింపజేస్తున్న లావణ్యం కృష్ణమోహన్ వెనుక నిలిచింది.

"మీట్ మై డాటర్ స్ఫూర్తి" అని పరిచయం చేసారు.

వినయంగా నమస్కరించింది వీసీ గారికి తదితరులకు. అందరూ కలిసి లోపలికి నడిచారు. వెన్వెంటనే పూర్ణ కుంభాలతో పురోహితులు స్వాగతం పలికి దీర్ఘాయురస్తని దీవించారు. రండి కృష్ణ మోహన్ అంటూ కాంఫరెన్స్ హాల్ కి దారితీసారు వీసీ.


కాంఫరెన్స్ హాల్ లో డైరెక్టర్స్, డిన్స్, స్పెషల్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒక ముగ్గురు రిసెర్చ్ స్టూడెంట్స్ కు కూడా మీట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు. కేంపస్ మొత్తం హాజరయ్యేలా ఈవినింగ్ అభినందన సభ ఏర్పాటు చేసినా కృష్ణమోహన్ సమయాభావమని చెప్పి అంగీకరించకపోవడంతో అప్పటికప్పుడే కాంఫిడెన్షియల్ మీట్ ఏర్పాటు చేసారు.

మీటింగ్ వెంటనే స్టార్ట్ అయింది. వీ సీ గారు స్వయంగా వేదికపై నున్న కృష్ణమోహన్ ను సభికులకి పరిచయం చేసారు.

"కృష్ణమోహన్ ఈజే గ్రేట్ సైంటిస్ట్. భారత ప్రభుత్వం ఆత్మాహుతి దళాల ప్రయోగాలను తిప్పికొట్టే పిల్స్ తయారు చెయ్యమంటే వచ్చారు వారికి వ్యవధి తక్కువగా ఉంది. అందుకని మన యూనివర్సిటీలో విద్యార్థులను తనకు సహాయకులుగా తీసుకొమ్మని అభ్యర్థించాము. వారి వారసులు మన విద్యార్థులవడం కన్నా మనకు కావలిసినదేముంది. ఇప్పుడు కృష్ణమోహన్ మాట్లాడతారు" అని చెప్పి క్లుప్తంగా ముగించారు వీసీ.

కృష్ణమోహన్ లేచి పరిచయాలు ముగించుకొని ఓ రెండు నిమిషాలు దేశానికి తాము చెయ్యవలసిన సేవ గురించి కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. ఆపై త్వరగా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే ఐ హేవ్ టు అటెండ్ మై జాబ్ అని ముగించారు. "షి ఈజ్ మై డాటర్ స్ఫూర్తి. షి విల్ జాయిన్ ఇన్ ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిష్ట్రీ హియర్" అనగానే అందరూ క్లాప్స్ తో ఆహ్వానించారు.

వెంటనే డిపార్ట్మెంట్ హెడ్స్ ని కృష్ణమోహన్ కీ, స్ఫూర్తి కీ పరిచయం చేయడం మొదలెట్టారు కన్వీనర్. ఆర్గానిక్ కెమిష్ట్రీ హెడ్ "కృష్ణవేణి" ని పరిచయం చెయ్యగానే ఆమెలో ఏదో అనీజీనెస్ కనిపించింది స్ఫూర్తికి. హడావుడిగా సాగిపోతున్న కృష్ణమోహన్ ఏమీ గమనించనట్లు ముందుకు సాగిపోయారు. అనంతరం స్టూడెంట్స్ ను పరిచయం చేసారు "హి ఈజ్ రాజశేఖర్ డూయింగ్ పీ హెచ్ డీ ఇన్ ఆటమిక్ ఎనర్జీ, శరత్, మధు, ప్రజ్ఞ ఆల్సో ఇన్ ఆటమిక్ ఎనర్జీ" అంటూ.

రాజశేఖర్ లో ఏదో తెలియని ఆకర్షణ బహుశా అతని రిజర్వ్ నెస్ కావొచ్చును. మేధావిత్వం అతని కళ్ళలో స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. ఆజానుబాహుడు, అరవింద నేతృడు అన్నట్లున్న విగ్రహం, ఎదుటి వ్యక్తిని చదివేస్తున్నట్లున్న చూపు, మోములో ఏదో శోధిస్తున్నట్లున్న భావాలు, ఇవన్నీ కలబోసి కనిపించి కృష్ణమోహన్ తనకి సపోర్ట్ చేయగల వ్యక్తిగా ఆతన్ని ఎంచుకొన్నారు. తనకి అవసరమైన పర్యవేక్షకునిగా శరత్ ని నియమించుకొన్నారు. మీట్ ముగిసింది. హేపీగా అందరూ డిస్బర్స్ అయ్యారు.

రాజశేఖర్లో ఉవ్వెత్తున ఉప్పొంగిన ఆనందం. జగజ్జేత అయిపోయిన ఫీలింగ్. తనకు సహకారం అందించేందుకు కూడ తన చిన్ననాటి నేస్తమే సెలెక్ట్ కావడంతో ఆతనిలో ఆనందం అవధులు దాటింది. శరత్ లో ఆకాశాన్నందుకొన్నంత ఆనందం. కలలో కూడా ఊహించని ఇంత అరుదైన గౌరవం తనకు దక్కినందుకు పొంగిపోయాడు. ఇంతవరకూ తన జీవితాన్ని తీర్చిదిద్దిన రాజశేఖర్ కు ఎంత ఋణపడిపోయానో అని కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ ఎన్నో భావాలు...

వడివడిగా ముందుకు సాగిపోతున్న కృష్ణమోహన్ చేతికి వీ. సీ గారు ఒక ఫోల్డర్ ఇచ్చారు.

"ప్లీజ్ హేవ్ ఎ లుక్ మిష్టర్ కృష్ణమోహన్" అంటూ.

"ష్యూర్ సర్. వి విల్ మీట్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్" అని జవాబిచ్చి కార్ లో కూర్చొన్నారు కృష్ణమోహన్.

వింటినుంచి వెలువడ్డ బాణంలా దూసుకుపోయింది కారు. ఒంటరిగా నిలిచిన స్ఫూర్తి వద్దకు వచ్చి రాజశేఖర్, శరత్, ప్రజ్ఞ, ఆమె క్లాస్ రూం చూపి లేబ్ కు వెళ్ళిపోయారు.

క్లాస్ లో అడుగు పెట్టగానే స్టూడెంట్సంతా గౌరవసూచకంగా లేచి స్వాగతించడంతో కాస్త ఇబ్బంది పడింది స్ఫూర్తి. ప్రతీ అమ్మాయి స్ఫూర్తి తన పక్కన కూర్చోవాలని ఆరాటపడ్డారు. కాని ఒక్క అమ్మాయి మాత్రం అంతగా ఆరాటం చూపలేదు జస్ట్ ఫార్మాలిటీ సేక్ అన్నట్లు పక్కకు జరగడం తప్ప. ఆ నేచర్ చూసి ఆకర్షితురాలైన స్ఫూర్తి ఆమె పక్కన కూర్చోగానే మిగిలినవాళ్ళంతా నిట్టూర్చడం స్పష్టంగా తెలిసి కాస్త నవ్వుకొంది.

"ఐ యాం స్ఫూర్తీ, స్ఫూర్తీ కృష్ణమోహన్" అంటూ స్వపరిచయం చేసుకొంది పక్కనున్న క్లాస్మేట్ తో.

వెంటనే పక్కమ్మాయి కాస్త తడబడుతూ "ఐ యాం శ్రీదేవి, జస్ట్... శ్రీదేవి" అంటూ నవ్వేసింది.

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సశేషమీ నవ్వుల తో........మరల 9-5-13 వరకూ.......
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 

No comments:

Post a Comment